ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణమంచిర్యాల హెడ్ పోస్టాఫీసుపై అధికారుల నిర్లక్ష్యం – కనీస సౌకర్యాలు లేక కస్టమర్ల తీవ్ర అవస్థలు

మంచిర్యాల హెడ్ పోస్టాఫీసుపై అధికారుల నిర్లక్ష్యం – కనీస సౌకర్యాలు లేక కస్టమర్ల తీవ్ర అవస్థలు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, అర్జున్ సమాచార ప్రతి నిధి, జూలై 28

మంచిర్యాల జిల్లా ప్రధాన తపాలా కార్యాలయం (హెడ్ పోస్టు ఆఫీసు) నిర్వహణలో తపాలా శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ప్రజలకు తీవ్ర శాపంగా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా, నిబంధనలకు అనుగుణంగా హెడ్ పోస్టాఫీసును నిర్వహించాల్సి ఉండగా, అధికారుల తీరు ఎవరికో ప్రయోజనం చేకూర్చేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనల ప్రకారం హెడ్ పోస్టాఫీసు నిర్వహణకు 7,000 నుండి 8,000 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. కానీ, అధికారులు మాత్రం కేవలం 2,100 చదరపు అడుగుల అత్యంత ఇరుకైన భవనంలోనే సరిపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 సబ్ ఆఫీస్‌లు, 230 బ్రాంచ్ ఆఫీస్‌లు ఈ ప్రధాన కార్యాలయం పరిధిలో పనిచేస్తున్నాయి. సేవింగ్స్ బ్యాంక్ , కౌంటర్ ఆర్గనైజేషన్, ఆఫీస్ సూపర్వైజర్ నివాస గృహాలు తదితర విభాగాలు సరుగ్గా ఉండాల్సిన చోట, అత్యంత చిన్న స్థలంలోనే ఇవన్నీ నడుపుతుండటంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గ్రీన్ మార్కెట్ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సబ్ పోస్టాఫీస్‌ను అక్కడ నుంచి తొలగించి, మంచిర్యాల బజార్‌లోని హెడ్ పోస్టాఫీస్‌లోనే విలీనం చేశారు. ఇరుకు సందులో ఉన్న హెడ్ పోస్టాఫీస్ భవనంలోనే ఈ కార్యాలయాన్ని కూడా నెట్టుకొస్తూ, కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నారు.

వేముల రహదారిపై ఉన్న ఈ పోస్టాఫీసు వద్ద కస్టమర్లకు కనీస సౌకర్యాలు లేవు. పనుల నిమిత్తం వచ్చే ప్రజలు నిలబడటానికి సరైన స్థలం లేదు, కూర్చోడానికి కుర్చీలు లేవు. ఆవరణలో శౌచాలయాలు (టాయిలెట్స్), ఇతర ప్రాథమిక సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆవరణను శుభ్రంగా ఉంచడంలోనూ, కస్టమర్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించడంలోనూ అధికారులు సంపూర్ణంగా విఫలమయ్యారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం వారి అలసత్వానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.

నగరంలో మంచి అద్దె చెల్లించి విశాలమైన భవనాన్ని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు, సొంత భవన నిర్మాణానికి స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ, దాని నిర్మాణానికి ఎలాంటి కృషి చేయడం లేదు. పైగా, ఆ స్థలం కబ్జాకు గురవుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటికైనా తపాలా శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, కస్టమర్లకు అందుబాటులో ఉండేలా, అన్ని సౌకర్యాలు కలిగిన నూతన భవనంలోకి హెడ్ పోస్టాఫీస్‌ను తరలించాలని మరియు సొంత భవన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని మంచిర్యాల పట్టణ ప్రజలు, వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!