కుమురం భీమ్ ఆసిఫాబాద్,అర్జున్ సమాచారం:
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల దృష్ట్యా జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితికా పంత్, సూచించారు.
ఆసిఫాబాద్ లోని తుంపెల్లి వాగు, గుండి వాగు లను పరిశీలించి, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి వరద తగ్గిన తర్వాతనే ప్రజలు దాటేందుకు అనుమతి ఇవ్వాలని వరద అధికంగా ఉన్న సమయంలో రాకపోకలు నిలిపివేయాలని, భద్రత చర్యలకు సంబంధించిన సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
రానున్న నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లో-లెవల్ బ్రిడ్జిల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని, పోలీసు శాఖ ప్రజల భద్రత కోసం వరద ప్రభావిత ప్రాంతాలు, లో-లెవల్ బ్రిడ్జిల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్–100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి పోలీసు సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.

