ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లీస్తే కఠిన చర్యలు.
ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.
జయశంకర్ భూపాలపల్లి. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 20.
ఎస్సి, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి మల్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు.కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్సి, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, ఆర్ ఓ ఆర్, ఉద్యోగుల పదోన్నతులు, ఉప ప్రణాళిక నిధులు వినియోగం, సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పురోగతి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో కమిషన్ ఛైర్మన్, సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ మంజూరైన నిధులను ఎస్సి, ఎస్టీ ఆవాసాలకు ఖర్చు చేయకపోతే ఆయా శాఖల అధికారులదే భాద్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ప్రజల సమస్యలను కేవలం కార్యాలయాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీసులు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఛైర్మన్ సూచించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పురోగతిపై సమీక్షించారు.
కేసుల దర్యాప్తు, బాధితులకు న్యాయం, పరిహారం అందించడం వంటి అంశాల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
కేసుల పురోగతిని సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు సంబంధిత అధికారులను ఆయన అభినందించారు.
ప్రమోషన్లలో రోస్టర్ రిజర్వేషన్లు తప్పనిసరిగా పాటించాలి
ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే సమయంలో రోస్టర్ రిజర్వేషన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రమోషన్లలో రిజర్వేషన్ నిబంధనల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, సంబంధిత అధికారులు నిబంధనలను పూర్తిగా పాటించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులకు భంగం కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
బాధితులకు పరిహారంతో పాటు ఉపాధి, పునరావాసం
తీవ్రమైన నేరాలకు, ముఖ్యంగా హత్య, అత్యాచారం వంటి ఘటనలకు గురైన ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలను కేవలం పరిహారంతోనే వదిలేయకుండా వారి పునరావాసంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఛైర్మన్ సూచించారు.
నిబంధనల ప్రకారం అర్హులైన బాధితులకు పరిహారం అందించడంతో పాటు అవసరాన్ని బట్టి ఉపాధి అవకాశాలు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, గృహ వసతి, పునరావాస సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
బాధిత కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రతి గ్రామంలో సివిల్ రైట్స్ డేను సమర్థవంతంగా నిర్వహించాలి
ప్రతి నెల గ్రామ స్థాయిలో నిర్వహించే సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమాలకు కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే హాజరుకాకుండా తహశీల్దార్లు, ఎస్‌ఐలు, సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
గ్రామీణ ప్రజలకు ఎస్సీ, ఎస్టీల హక్కులు, చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అందుబాటులో ఉన్న ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలపై అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు, ఇతర నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందని ఛైర్మన్ పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి పంచాయతీ నిధులు లేదా సీఎస్ఆర్ నిధుల ద్వారా సిసి కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు, ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ నిఘా పెంచడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు నేరాలు జరిగినప్పుడు దర్యాప్తుకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ఎస్సీ, ఎస్టీ ప్రజల పట్ల అధికారులు మానవీయ కోణంతో, గౌరవప్రదంగా వ్యవహరించాలని అన్నారు.
ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, వాటిని నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలపై నమ్మకం పెరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత శాఖలు సమయపాలనతో పరిష్కరించాలని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ
ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఛైర్మన్ సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, అర్హత ఉన్న వారికి పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలను అధికారులు ప్రాధాన్యతతో పరిష్కరించి, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పేర్కొన్నారు.
అధికారుల సమన్వయంతోనే మెరుగైన ఫలితాలు
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం ఒక్క శాఖ బాధ్యత కాదని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. జిల్లా స్థాయిలో అధికారుల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో పథకాల అమలును పర్యవేక్షించాలని సూచించారు. విదేశీ విద్యా, బాధితులకు పరిహారం, కులాంతర వివాహం చెల్లింపులు పెండింగ్ ఉన్నవాటి నివేదిక అందచేయాలని ఎస్సి అభివృద్ధి అధికారిని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ బాధితులకు కమిషన్ సూచించిన విధంగా ఇళ్ళు కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి నెలా క్రమం తప్పక పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
ఎస్పి సంకీర్త్ మాట్లాడుతూ అత్యాచార తదితర సంఘటనలపై తక్షణమే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కమిషన్ నుండి 6 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో మూడు కేసులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఛైర్మన్ కు సబ్యులకు జ్ఞాపిక అందచేశారు.
ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మి నారాయణ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్,
డీఆర్వో వసంత కుమారి, ఎస్సి అభివృద్ధి అధికారి సుకీర్తి జై భీం, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, కాటారం, భూపాలపల్లి డీఎస్పీలు సూర్య నారాయణ, సంపత్ రావు, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపిడివోలు వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

