ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeఎడిటోరియల్జీవనోపాధే పరమావధిగా…40 ఏళ్లుగా శ్రమనే నమ్ముకున్న మహబూబ్

జీవనోపాధే పరమావధిగా…40 ఏళ్లుగా శ్రమనే నమ్ముకున్న మహబూబ్

📰 Generate e-Paper Clip

జీవనోపాధే పరమావధిగా…40 ఏళ్లుగా శ్రమనే నమ్ముకున్న మహబూబ్

మంథని, ఆగస్టు 20: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 20,

కష్టపడి సంపాదించిన సొమ్ములోనే నిజమైన తృప్తి ఉందని నిరూపిస్తూ మంథనికి చెందిన సయ్యద్ మహబూబ్ గత 40 ఏళ్లుగా తన వృత్తిని కొనసాగిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. పల్లీలు, అల్లం, రబ్బర్ తదితర చిరు తినుబండారాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మంథని పట్టణంలోని ప్రధాన ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు.

చేతిలో చిన్న బుట్ట.. అందులో పల్లీలు, ఇతర చిరు తినుబండారాలు.. ఇదే ఆయనకు జీవనాధారం. వయసు పెరుగుతున్నా శ్రమను మాత్రం వీడకుండా నిజాయితీగా పనిచేస్తూ, స్వయం కృషితో కుటుంబాన్ని పోషించుకుంటున్న మహబూబ్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

మంథని ప్రాంతంలో సయ్యద్ మహబూబ్‌ను స్థానికులు ఆప్యాయంగా పలకరిస్తూ, ఆయనతో స్నేహపూర్వకంగా మెలుగుతుంటారు. ఆయన చిరునవ్వు, నిరాడంబర జీవన విధానం, కష్టపడి పనిచేసే తత్వం స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుత కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలకు భిన్నంగా, తన శ్రమనే పెట్టుబడిగా చేసుకుని నాలుగు దశాబ్దాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న మహబూబ్ జీవన విధానం యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏ వృత్తి చిన్నది కాదని, కష్టపడి నిజాయితీగా సంపాదించే ప్రతి రూపాయి గౌరవప్రదమైనదేనని ఆయన జీవితం చాటిచెబుతోంది.

“శ్రమకు సిగ్గుపడకూడదు.. నిజాయితీగా సంపాదించడమే గొప్పతనం” అనే సందేశాన్ని తన జీవితంతోనే చూపిస్తున్న మహబూబ్‌ను మంథని ప్రజలు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!