నల్గొండ,అర్జున్ సమాచారం:
రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ పట్టణంలో గాంధీ జయంతి కార్యక్రమాలు ముగించుకుని నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తాను సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్‌లు పరిశీలించిన విషయం వాస్తవమేనని మంత్రి తెలిపారు. అప్పట్లో కొందరు ఆపరేటర్లు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో సుమారు ఐదు గంటల పాటు విద్యుత్, కరువు పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
అయినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇతర రాష్ట్రాల నుంచి 19 వేల మెగావాట్లకు పైగా విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సింగరేణి బొగ్గు లింకేజీ సమస్యలు, నైనీ బ్లాక్‌కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి బొగ్గు సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ద్వారా నియోజకవర్గానికి ప్రత్యేకంగా 5 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కరువు పరిస్థితులను చూసి ప్రతిపక్షాలు సంతోషిస్తున్నాయని విమర్శించిన ఆయన.. తమ ప్రభుత్వం రైతులు, ప్రజలను ఆదుకునేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
==========================

