చదువుకు వయసుతో సంబంధం లేదు.. మహిళా సాధికారతకు విద్యే బలమైన ఆయుధం
పన్నూర్‌లో విజయవంతంగా ‘అమ్మకు అక్షరమాల’ (ఉల్లాస్) పరీక్ష – సందర్శించిన సర్పంచ్ చిందం మహేష్.
అర్జున్ సమాచారం/సెప్టెంబర్ 27. రామగిరి డెస్క్.
మహిళా అక్షరాస్యత, సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఉల్లాస్ – అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా రామగిరి మండలం పన్నూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) ఆవరణలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు పరీక్ష నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షను విజయవంతంగా రాశారు.
చదువును మధ్యలో ఆపేసిన మహిళలను గుర్తించి, వారు తిరిగి విద్యను కొనసాగించేలా ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమం ద్వారా సెర్ప్ ప్రోత్సహిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు అక్షరాస్యులుగా మారడంతో పాటు విద్యాపరంగా, సామాజికంగా సాధికారత సాధించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాన్ని పన్నూర్ గ్రామ సర్పంచ్ చిందం మహేష్ సందర్శించి పరీక్ష రాస్తున్న మహిళలను ఉత్సాహపరిచారు. చదువుకు వయసుతో సంబంధం లేదని, చదువే జీవితాన్ని మార్చే బలమైన ఆయుధమని అన్నారు. ప్రతి మహిళ అక్షరాస్యత సాధించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఉల్లాస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి నేరుగా పదో తరగతి పరీక్ష రాసే అవకాశం లభిస్తుందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. మహిళలను ఆర్థికంగా మాత్రమే కాకుండా విద్యాపరంగా, సామాజికంగా సాధికారత దిశగా నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి, వార్డు సభ్యుడు సదానందం, వీఏ గాజుల వనిత, వీవో ఓబీ సల్యాల మహదేవి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

