జైపూర్ మండలం ఇందారం ఓపెన్ కాస్ట్ లో కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ కరువుఇప్పటికైనా కార్మికుల కష్టాలు తీరునుసింగరేణి కాంట్రాక్ట్ కార్మికులపై చిన్న చూపు.
అర్జున్ సమాచారంచెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 1
(జైపూర్): సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఏడు సంవత్సరాలుగా ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని భూముల్లో మంజూరైన ఇందారం ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రారంభించి ఏడు సంవత్సరాలు పూర్తయింది. అప్పటి నుంచి వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు
అయితే ప్రధాన సంస్థ కార్మికులకు వైద్య సౌకర్యాలు, ఇతర సంక్షేమ పథకాలు అందుతుండగా, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం కార్మిక రాజ్య బీమా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కార్మికులు వాపోతున్నారు.
నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ తన కింద పనిచేసే అర్హులైన కార్మికులందరినీ ఈఎస్ఐ యాక్ట్ 1948 కింద కవర్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ఆ నిబంధన అమలు కావడం లేదని, అనారోగ్యానికి గురైనా, ప్రమాదం జరిగినా సొంత డబ్బులతోనే వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు
ఏడేళ్లుగా చెమటోడ్చి బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న తమకు కనీస వైద్య భద్రత కల్పించాలని, వెంటనే అధికారులు స్పందించి కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై సింగరేణి యాజమాన్యం, సంబంధిత కాంట్రాక్ట్ సంస్థలు స్పందించాల్సి ఉంది.

