మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రుల్లో డిఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మిక తనిఖీలు
అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 1. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, ల్యాబ్‌లు తప్పనిసరిగా ‘క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్’ ప్రకారం నమోదు చేసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డిఎంహెచ్‌ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు.
మంగళవారం మంచిర్యాల పట్టణంలోని సిటీ న్యూరో, శ్రీహర హాస్పిటల్, ఆదిత్య హాస్పిటల్, మరియు సచిన్ హాస్పిటళ్లను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, సీఎం రిలీఫ్ ఫండ్ (సిఎంఆర్‌ఎఫ్) కింద అందిస్తున్న చికిత్సలు, పంపించిన వైద్య బిల్లుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నాలుగు ఆస్పత్రుల్లో లభిస్తున్న వైద్య సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలో పనిచేసే స్పెషలిస్ట్ వైద్యుల వివరాలు, అందించే వైద్య సేవలకు వసూలు చేసే ఛార్జీల పట్టికను అందరికీ కనిపించేలా గోడలపై అతికించాలి. రోగులకు తాగునీరు, ఆసనాలు, వీల్ చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉంచాలి.ప్రతి ఆస్పత్రిలో బయో-మెడికల్ వేస్ట్ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ లైసెన్స్, లీజు పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. పారామెడికల్ సిబ్బంది వివరాలను లేబర్ కమిషనర్‌కు సమర్పించాలి. ఆస్పత్రికి వచ్చే విజిటింగ్/కన్సల్టెంట్ వైద్య నిపుణుల వివరాలపై ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేయాలి.
ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత వైద్యులు డాక్టర్ అబ్బురి శ్రీనివాస్, డాక్టర్ గంప మల్లేష్, డాక్టర్ ప్రతాప్ గౌడ్, డాక్టర్ వినోద్ మరియు జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

