ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణజగిత్యాలచెన్నూరు నియోజకవర్గంలో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ.. వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన!

చెన్నూరు నియోజకవర్గంలో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ.. వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన!

📰 Generate e-Paper Clip

చెన్నూరు నియోజకవర్గంలో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ.. వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన!
అర్జున్ సమాచారం జులై 21 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:

చెన్నూరు:చెన్నూరు నియోజకవర్గంలోని గురుకులాలు, వసతి గృహాలు, నివాస పాఠశాలల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు విద్యా వ్యవస్థపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, వసతుల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్న విద్యాసంస్థల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
తాజాగా బాలికల గురుకుల పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు బయటకు వెళ్లిపోవడం కలకలం రేపింది. సిబ్బంది పర్యవేక్షణ లోపమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వసతులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇటీవల మహాత్మా జ్యోతిరావు ఫూలే విద్యాసంస్థ విద్యార్థులు శాసనసభ్యుడిని కలిసి తమ సమస్యలు వివరించారు. . అనంతరం సంబంధిత విద్యాసంస్థ ప్రధానాచార్యుడు, ముగ్గురు అధ్యాపకుల బదిలీ, కాపలాదారుడిని విధుల నుంచి తొలగించిన ఘటన చర్చనీయాంశమైంది.
కోటపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నుంచి పదిహేడేళ్ల బాలిక అదృశ్యమై మూడు రోజుల తర్వాత ఆచూకీ లభించడం తీవ్ర కలవరానికి దారి తీసింది. అదే విద్యాలయంలో చదువుతున్న దాదాపు రెండువందల మంది బాలికల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మైనార్టీ నివాస పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం అందించిన ఘటనపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు నివాస పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నట్లు రాష్ట్రస్థాయిలో వార్తలు వెలువడటం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది.
మార్చి 29న చెన్నూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని వసతి గృహంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన జరిగి పది రోజులు గడవకముందే మరో విద్యార్థిని మరుగుదొడ్డి శుభ్రపరిచే ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలవరపరిచింది.
చెన్నూరు మహాత్మా జ్యోతిరావు ఫూలే వసతి గృహంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో దాడికి పాల్పడిన ఏడుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేయడం మరో సంఘటనగా నిలిచింది.
ఇలా వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రాణ భద్రత, విద్యా ప్రమాణాలు, పర్యవేక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం కంటే విద్యాసంస్థల్లో నెలకొన్న లోపాలను సరిదిద్ది విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!