ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆగ్రహం…
అర్జున్ సమాచారం .నవంబర్ 12 .మంథని డెస్క్.
20 రోజులుగా మార్కెట్ యార్డులోనే ధాన్యం.. వెంటనే కాంటాలు పెట్టాల.రైతుల పంట కొనుగోళ్లపై శ్రద్ధ చూపని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.దళారులకు అమ్ముకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోంది: పుట్ట మధూకర్.
మంథని, కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, కుటుంబ సభ్యులకు పదవులు ఇప్పించుకోవడంపై మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు చూపిస్తున్న శ్రద్ధ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయించడంలో చూపడం లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు.
గురువారం మంథని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన సందర్శించి, ధాన్యం విక్రయానికి తీసుకువచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్న రైతులతో మాట్లాడారు. అనంతరం మార్కెట్ యార్డు కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. వెంటనే కాంటాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో పుట్ట మధూకర్ మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు రైతులు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులవుతున్నా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయనకు వత్తాసు పలుకుతున్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభల్లో మాత్రం రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్నారని చెప్పడం వెనుక ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కనిపిస్తోందని ఆరోపించారు.
ఇటీవల ఒక సభలో ధాన్యాన్ని రూ.3 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని, మంథని మార్కెట్ యార్డులో కనీసం రూ.2,500 మద్దతు ధరకు కొనుగోలు చేసేవారు కూడా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకు విక్రయించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంథని ప్రాంతంలో పెద్ద సంఖ్యలో రైతులు ఉన్నప్పటికీ వారి సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే చొరవ చూపడం లేదని విమర్శించారు. మార్కెట్ యార్డులో 20 రోజులుగా రైతులు ధాన్యంతో ఎదురుచూస్తున్నా సంబంధిత అధికారులు, మార్కెట్ యార్డు పాలకవర్గం అక్కడికి వచ్చి సమస్యలను పరిశీలించకపోవడం విచారకరమన్నారు. మరోవైపు వాతావరణంలో మార్పులు, తుఫాన్ ప్రభావం ఏర్పడితే ధాన్యం తడిసి రైతులకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మార్కెట్ యార్డు కార్యదర్శి మరో రెండు రోజుల్లో కాంటాలు ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ, రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని, అవసరమైతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కొనుగోళ్లు ప్రారంభించేలా చేస్తామని పుట్ట మధూకర్ స్పష్టం చేశారు.

