మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు రాజాపూర్ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుల సూటి ప్రశ్నలు.
అర్జున్ సమాచారం :నవంబర్ 12 .రామగిరి రిపోర్టర్.
పదేళ్ల పాలనలో ఏం చేశారు? రైతులకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలి.
మూడు సంవత్సరాల అభివృద్ధి, పదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధం.
రామగిరి మండలం సింగరేణి ప్రభావిత గ్రామమైన రాజాపూర్‌ను సందర్శించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ చేసిన వ్యాఖ్యలపై గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని గతంలో తాను చేసిన పనులపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజాపూర్ ప్రజలకు గత పదేళ్ల పాలనలో ఏం చేశారో వివరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు రాజకీయంగా మాట్లాడేటప్పుడు తన రాజకీయ గతాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శీనుబాబు పేర్లు ప్రస్తావించకుండా రాజకీయ విమర్శలు చేయలేని పరిస్థితి ఎందుకని ప్రశ్నించారు. తనను ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు ఆ తర్వాత ఎందుకు ఓడించారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తన కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొన్న ఇబ్బందులపై కూడా సమాధానం చెప్పాలని అన్నారు.
708 ఎకరాల భూముల అవార్డుపై సమాధానం చెప్పాలి.
రాజాపూర్‌లో 708 ఎకరాల భూములకు సంబంధించి అవార్డు పాస్ అయిన సమయంలో పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆ సమయంలో రైతులకు న్యాయం జరిగేలా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రైతులతో సంతకాలు చేయించేందుకు అనుచరులు ప్రయత్నించారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ.11.50 లక్షల పరిహారం ఇప్పిస్తామని చెప్పి, ఆ తర్వాత రూ.4.50 లక్షల పరిహారం గురించి మాట్లాడిన అంశంపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో అధికారులు, రైతుల సమక్షంలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించాలని కోరారు.
బుధవారంపేట గ్రామ పంచాయతీ రికార్డులు తీసుకెళ్లిన సమయంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గ్రామ ప్రజలకు అవసరమైన తీర్మానాలు ఇవ్వకుండా బయటి వ్యక్తులకు తీర్మానాలు ఇచ్చారన్న ఆరోపణలపైనా సమాధానం చెప్పాలని అన్నారు.
కాంగ్రెస్ పాలకవర్గంపై నిరాధార ఆరోపణలు తగవు,
ప్రస్తుత కాంగ్రెస్ పాలకవర్గం ప్రజల మధ్య ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు, శీనుబాబులతో సంప్రదిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పార్టీ భేదాలు లేకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు చెందిన నిరుపేద యువతకు సైతం ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. మహిళలకు మగ్గం వర్క్, కుట్టు మిషన్ శిక్షణ అందిస్తూ స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
తమ పాలకవర్గంపై కమిషన్లు, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారంటూ చేస్తున్న విమర్శలకు ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. గతంలో జేఎన్టీయూలో ప్రైవేట్ సెక్యూరిటీ, డ్రైవర్ ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నారంటూ ప్రజల్లో ఉన్న ఆరోపణలపై కూడా పుట్ట మధు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు.
బహిరంగ చర్చకు సిద్ధం,
పుట్ట మధుకు కాంగ్రెస్ నాయకులు సూటిగా ప్రశ్నలు సంధిస్తూ.. తమ నాయకులు ఫోన్ చేస్తారా, తాము నాయకులను కలుస్తామా అనేది తమ పార్టీ అంతర్గత విషయమని, దానిపై ఆయనకు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు. ముందుగా తన పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని సూచించారు.
తమ మూడేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, ఆయన పదేళ్ల పాలనలో జరిగిన పనులపై గ్రామాల వారీగా, లెక్కలతో సహా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆధారాలతో సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. ఎవరు ప్రజలకు సేవ చేశారు, ఎవరు ఇబ్బందులకు గురిచేశారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజాపూర్ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుల్లెల సతీష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు మాటేటి శ్రీనివాస్, వార్డు సభ్యులు పుల్లెల సుజాత, కన్నూరి శేషికుమార్, ఎండీ ఆఫీస్ పుట్ట సంతోష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కన్నూరి వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు నామని కొమురయ్య, నంది కుమార్, కాల్వ మహేష్, ఉమ్మానవేన కుమార్, మాటేటి రాజా, మల్లు, నామని కుమార్, తోకల రఘు, తిరుపతి, ఆసీస్, అవినాష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

