పెండింగ్ ఉపకార వేతనాలు తక్షణమే .
విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్!
అర్జున్ సమాచారం జులై 05 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:
మీమంచిర్యాల, ఆగస్టు 05 గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల వంశీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థుల సమస్యలను విస్మరించిందని విమర్శించారు. గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఉపకార వేతనాలు, ఫీజు బకాయిలు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా పేరుకుపోయాయని పేర్కొన్నారు.
ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో ఇంజినీరింగ్, వైద్య, స్నాతకోత్తర, డిగ్రీ కళాశాలల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థులు తమ విద్యా ధ్రువపత్రాల కోసం ప్రైవేటు కళాశాలల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బకాయి ఫీజులు చెల్లించనిదే ధ్రువపత్రాలు ఇవ్వబోమని కొన్ని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయని, దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సమావేశంలో సాయితేజ, ప్రణయ్, బచ్చల జశ్వంత్, ఆత్రం రమేష్, కుర్సింగ పవన్, భీషణ్తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

