మంథనిలో దుద్దిళ్ల రాజ్యాంగమే నడుస్తోందా?.
అర్జున్ సమాచారం.నవంబర్ 27.రామగిరి రిపోర్టర్…
ప్రజాధనంతో నిర్మించిన భవనానికి ఒక్కరి పేరేలా పెడతారు?అంబేద్కర్, రాజ్యాంగాన్ని అవమానిస్తున్న దుద్దిళ్ల కుటుంబం,మంథని చరిత్ర, మూలాలను కనుమరుగు చేసే ప్రయత్నం,ఎంపీ స్పందనతో రాత్రికి రాత్రే మరో శిలాఫలకం ఏర్పాటు,శిలాఫలకంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర విమర్శలు…
మంథని: మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాజ్యాంగానికి విరుద్ధంగా తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవనాన్ని సందర్శించిన ఆయన, భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేరు మాత్రమే ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చెల్లించిన పన్నుల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ భవనాలకు వ్యక్తిగతంగా ఒకరి పేరు మాత్రమే పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుకు ఒక్కరోజు ముందే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా శ్రీధర్‌బాబు వ్యవహరించారని ఆరోపించారు. దుద్దిళ్ల కుటుంబం అధికారంలో ఉన్నప్పుడల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను, ఆయన రచించిన రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజ్యాంగం అమలులోకి రాకముందు సామాజిక వివక్షలో భాగంగా జుట్టు పన్ను, రవిక పన్ను వంటి ఆచారాలు ఉండేవని గుర్తుచేస్తూ, నేటికీ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు.
రాజ్యాంగాన్ని చేతబట్టి ఢిల్లీలో తిరిగే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మంథనిలో జరుగుతున్న పరిణామాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం రాజ్యాంగాన్ని ముందుపెట్టి ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక అదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ అంశంపై స్పందించిన తర్వాత రాత్రికి రాత్రే మరో శిలాఫలకాన్ని భవనం లోపల ఏర్పాటు చేశారని తెలిపారు. భవనం ముందు ఉన్న పూర్వపు శిలాఫలకాన్ని తొలగించకుండా, కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. మంథనిలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏ విధంగా అమలవుతున్నాయో మేధావులు ఆలోచించాలని అన్నారు.
గతంలో ఈ ప్రాంతంలో మహిళా భవనం ఉండేదని, మహిళా చైతన్యానికి సత్యభామ, చంద్రకళ వంటి వారు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన భవనం పేరును పక్కనపెట్టి, చరిత్రను కనుమరుగు చేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. మంథని మూలాలను, చారిత్రక గుర్తింపును చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పురాతన మున్సిపల్ కార్యాలయం, బాలికల వసతి గృహం వంటి భవనాలను తొలగించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కుటుంబానికి ఈ ప్రాంత చరిత్రతో సంబంధం లేకపోయినా ప్రతి అంశంలో తన తండ్రి పేరు ఉండాలనే పట్టుదల ఎందుకని ప్రశ్నించారు. ప్రజలకు అన్నం పెట్టిన, చదువు చెప్పించిన, అభివృద్ధికి తోడ్పడిన చరిత్ర లేకపోయినా ప్రతి నిర్మాణానికి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
మంథని మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధులు, పాలకవర్గం ఉన్నప్పటికీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. గతంలో మార్కెట్ కమిటీ ప్రారంభోత్సవ సమయంలో అప్పటి చైర్మన్ సత్యనారాయణరాజు పేరు లేకుండానే శ్రీపాదరావు ప్రారంభించారని గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా మున్సిపల్ చైర్మన్, ఎంపీ పేర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా భవనాలు ప్రారంభించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ప్రజల కష్టార్జితంతో, పన్నుల రూపంలో సమకూరిన నిధులతో నిర్మించే ప్రభుత్వ భవనాలకు వ్యక్తిగతంగా ఒకరి పేరు మాత్రమే పెట్టడం సమంజసం కాదన్నారు. సొంత డబ్బులతో నిర్మించుకునే వాటికి వ్యక్తిగత పేర్లు పెట్టుకోవచ్చని, కానీ ప్రజాధనంతో నిర్మించిన భవనాలకు ప్రజాప్రతినిధులందరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొంటూ, ప్రస్తుత శిలాఫలకాన్ని తొలగించి ప్రభుత్వ నిబంధనలు, ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత ప్రజాప్రతినిధులందరి పేర్లు పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు.

