కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ గట్టి హెచ్చరిక.
అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 12, రామగుండం డెస్క్:
సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
సింగరేణి 11 ఇంక్లైన్ ఆర్జీ-1 పరిధిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడి మోకాలికి గాయమై ఆరు కుట్లు పడిన ఘటనను ఎంపీ ప్రస్తావించారు. అదృష్టవశాత్తూ ఈసారి పెద్ద ప్రమాదం తప్పిందని, అయితే ఇలాంటి ఘటనలను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
“ఈరోజు ఆ కార్మికుడు ఆరు కుట్లతో బయటపడ్డాడు.. రేపు అదే పరిస్థితి ప్రాణాపాయంగా మారకూడదు. కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు” అని స్పష్టం చేశారు.
కూలిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాలు, ప్రాణహాని ఉన్న అండర్‌గ్రౌండ్ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని కోరారు. అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి పెంపుతో పాటు ప్రధానంగా కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు వినియోగించాలని సూచించారు. ఇటీవల బెల్లంపల్లిలో జరిగిన ప్రమాదాన్ని కూడా ప్రస్తావిస్తూ, వరుస ప్రమాదాల నివారణకు సింగరేణి భద్రతా వ్యవస్థపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని కోరారు.
ఉత్తర తెలంగాణకు మెరుగైన రైలు కనెక్టివిటీ కల్పించాలి
ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్, సికింద్రాబాద్‌తో మెరుగైన రైలు కనెక్టివిటీ కల్పించాల్సిన బాధ్యత రైల్వే శాఖపై ఉందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్‌కు అదనపు రైళ్ల కోసం తాను పలుమార్లు విజ్ఞప్తి చేశానని తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల సమయంలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్‌ను కలిసి ఉత్తర తెలంగాణ ప్రజల రైలు సౌకర్యాల అవసరాలను వివరించినట్లు చెప్పారు. ఈ ప్రాంతం నుంచి రైల్వేకు భారీగా ఫ్రైట్ ఆదాయం వస్తున్నప్పటికీ, అదే స్థాయిలో ప్రయాణికుల రైలు సౌకర్యాలు లేకపోవడం అన్యాయమని అన్నారు.
రైల్వేకు ఆదాయం అందించే ప్రాంతాల్లో ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని నీడ్ బేసిస్‌పై అధ్యయనం చేయాలని కోరారు. ఇటీవల నిర్వహించిన టెస్ట్ రన్, పండుగల సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లను స్వాగతిస్తూ, సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్/సికింద్రాబాద్ కనెక్టివిటీని శాశ్వతంగా బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ భవనానికి వెంటనే స్థలం కేటాయించాలి
అంబేద్కర్ భవన నిర్మాణం కోసం తన ఎంపీ ల్యాడ్స్ నుంచి సుమారు రూ.50 లక్షలు ఇప్పటికే కేటాయించామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఈ అంశంపై కలెక్టర్ స్థాయి నుంచి సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి వెళ్లినప్పటికీ స్థల కేటాయింపులో జాప్యం జరుగుతోందని అన్నారు.
“నిధులు నేను ఇప్పటికే కేటాయించాను. కలెక్టర్ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం ఇక ఆలస్యం చేయకుండా వెంటనే స్థలం కేటాయించి అంబేద్కర్ భవన నిర్మాణానికి మార్గం సుగమం చేయాలి” అని డిమాండ్ చేశారు.
కార్మికుల భద్రత, ఉత్తర తెలంగాణకు మెరుగైన రైలు కనెక్టివిటీ, అంబేద్కర్ భవనానికి స్థల కేటాయింపు అంశాలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు.

