ఆర్టీసీ కార్మిక పరిషత్ ప్యానల్‌ను గెలిపించాలి.ఆర్టీసీ బలోపేతం.. కార్మికుల ఉద్యోగ భద్రతే లక్ష్యం, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. మణిరాం సింగ్.
అర్జున్ సమాచారం అక్టోబర్ 6 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎన్‌టీయూసీ అనుబంధ కార్మిక పరిషత్ ఎన్నికల బరిలో నిలుస్తుందని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. మణిరాం సింగ్ తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్టీసీ సంస్థను మరింత బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలంటే కార్మికులు, ఉద్యోగులు కార్మిక పరిషత్ ప్యానల్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్త డిపోల ఏర్పాటు, మహిళా సిబ్బందికి మెరుగైన రక్షణ, సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయించేందుకు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తీసుకువస్తామని మణిరాం సింగ్ పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్మిక పరిషత్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. వన్‌మెన్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించడం, ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగించడం తమ ప్రధాన డిమాండ్లలో ఒకటని తెలిపారు. ప్రయాణికులు తప్పనిసరిగా టికెట్ తీసుకునేలా అవగాహన కల్పించి, టికెట్ తీసుకునే బాధ్యతను ప్రయాణికులపైనే ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో డ్రైవర్లపై అదనపు బాధ్యత, ఒత్తిడి తగ్గి వారికి సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించే అవకాశం ఉంటుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల హక్కులు, సంస్థ పరిరక్షణ కోసం కార్మిక పరిషత్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే కార్మిక పరిషత్ టైర్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బొల్లు మల్లయ్య, మంచిర్యాల జిల్లా టీఎన్‌టీయూసీ అధ్యక్షులు ఓ. జీవరత్నం, ఆవుల సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జ దుర్గయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీఎన్‌టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఎన్. పుల్లయ్య, డి. అంజయ్య, సీహెచ్. కిష్టయ్య, ఆర్. గంగాధర్ గౌడ్, ఎస్.కె. అజ్వర్ భాష, బి. సత్యనారాయణ, బెల్లంపల్లి మండల్ అధ్యక్షులు రామటెంకి హరి బాబు, తదితరులు పాల్గొన్నారు.

