ePaper
Friday, October 16, 2026
ePaper
Homeతెలంగాణరూ.800 కోట్లతో చేపట్టిన మంథని రోడ్ల అభివృద్ధి పనులు పనులను 18 నెలల్లో పూర్తి చేస్తాం...

రూ.800 కోట్లతో చేపట్టిన మంథని రోడ్ల అభివృద్ధి పనులు పనులను 18 నెలల్లో పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

రూ.800 కోట్లతో చేపట్టిన మంథని రోడ్ల అభివృద్ధి పనులు పనులను 18 నెలల్లో పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ప్రతి 15 రోజులకు మంథని రహదారి పనులపై సమీక్ష

రూ.20 కోట్లతో NAC స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

కమాన్‌పూర్‌–మంథని నాలుగు లేన్ల రహదారికి రూ.200 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం ఆమోదం తీసుకుంటాం

ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్‌పామ్‌ సాగు వైపు రైతులు దృష్టి సారించాలి

మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, శ్రీధర్ బాబు

పెద్దపల్లి ప్రతినిధి అర్జున్ సమాచార్ ఆగస్టు – 19:
మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని, గత రెండున్నరేళ్లలో సుమారు రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

మంథనిలోని గంగాపురి వద్ద రూ.20 కోట్లతో న్యాక్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, మంథని–రామగుండం నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు రూ.21 కోట్లు, ఇతర ఆర్‌అండ్‌బీ రహదారి పనులకు రూ.97 కోట్లు, మంథని పట్టణంలో మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.15 కోట్లతో బీటీ రోడ్లు, రూ.9 కోట్లతో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు.

మంథని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో నాలుగు మండలాల లబ్ధిదారులకు రేషన్‌ (స్మార్ట్‌) కార్డులు, కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, మైనార్టీలకు కుట్టుమిషన్లు, మహిళా స్వశక్తి సంఘాలకు చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు.

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన మహనీయుడు పీవీ నరసింహారావు, అజాతశత్రువు దుద్దుల శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించిన మంథని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వానం మేరకు మంథనికి రావడం సంతోషంగా ఉందన్నారు.

మంథని నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రూ.800 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. నల్గొండలో కూడా ఇంత భారీగా నిధులు మంజూరు కాలేదన్నారు. గోదావరి నదిపై హై లెవల్‌ బ్రిడ్జికి రూ.125 కోట్లు, బైపాస్‌ రహదారికి రూ.162 కోట్లు, హెచ్ ఏ ఎం రహదారులకు రూ.203 కోట్లు, మంథని–ఓడేడు రహదారికి రూ.60 కోట్లు తదితర పనులకు నిధులు మంజూరు చేశామని చెప్పారు.

మంథని నియోజకవర్గంలోని అన్ని రహదారి పనులను 18 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రతి 15 రోజులకు మంథని రహదారి పనులపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలందరికీ డబుల్‌ రోడ్డు సౌకర్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కమాన్‌పూర్‌ నుంచి మంథని మున్సిపాలిటీ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సుమారు రూ.200 కోట్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తీసుకుని, వచ్చే 15 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.

గంగాపురి వద్ద నిర్మిస్తున్న NAC స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను మహిళలు, యువతకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తామని చెప్పారు.

ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం లభించడం సాధ్యం కాదని, ప్రైవేట్‌ రంగంలో ఉపాధి పొందేందుకు యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి కూడా సుమారు రూ.200 కోట్ల పనులకు నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.

రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ పేరును సర్ ముసాయిదా జాబితాలో పరిశీలించుకోవాలని, ప్రతి ఓటు ముఖ్యమైనదేనని మంత్రి సూచించారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కష్టకాలంలో కూడా మంథని ప్రజలు తమ వెంట ఉన్నారని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి రూ.800 కోట్ల నిధులు మంజూరు చేయడం కూడా తక్కువేనని అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రతిభావంతుడని, ఏ పనినైనా పూర్తి చేయగల సామర్థ్యం ఆయనకు ఉందన్నారు.

దివంగత శ్రీపాదరావుతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని, శాసనసభ స్పీకర్‌గా ఆయన మంచి విలువలతో పనిచేశారని మంత్రి గుర్తు చేశారు. మంథని అభివృద్ధి కోసం ప్రతి ముఖ్యమంత్రి నుంచి నిధులు తీసుకురావడంలో శ్రీధర్‌బాబు కృషి చేస్తున్నారని తెలిపారు.
మంథని నియోజకవర్గంలో మంజూరైన అన్ని అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో నాణ్యతతో పూర్తి చేయాలని స్థానిక నాయకత్వానికి సూచించారు. శ్రీధర్‌బాబుకు మంచి పేరు వచ్చేలా స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రైతులు, మహిళలు, చేనేత కార్మికులకు అండగా నిలుస్తోందన్నారు. ఈ ఏడాది చిలకపచ్చ రంగులో నాణ్యమైన ఇందిరమ్మ చీరలను అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించామని, రూ.1 లక్ష కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేశామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మంథని ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా ఎన్నికై, కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టానని తెలిపారు.
మంథని ప్రాంతానికి గత రెండున్నరేళ్లలో సుమారు రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మంథని పట్టణంలోని బ్రిడ్జి నుంచి బస్‌ డిపో వరకు రూ.15 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని, మానేరు నదిపై కూడా వంతెన మంజూరైందని చెప్పారు.

మంథని మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
గోదావరి నదిపై హై లెవల్‌ బ్రిడ్జి, అవసరమైన రహదారి విస్తరణ పనులకు నిధులు మంజూరు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, రహదారి పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, పాత కార్డుల్లో కొత్త లబ్ధిదారుల చేరిక, డైట్‌ ఛార్జీల పెంపు, కాస్మెటిక్‌ ఛార్జీల పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.

గత పది సంవత్సరాల్లో పేదల గృహ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు.

మంథని ప్రాంతానికి పరిశ్రమలను తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించామని, కోకాకోలా వంటి బహుళజాతి సంస్థ మంథనిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. చిన్న సాఫ్ట్‌వేర్‌ కేంద్రం కూడా ప్రారంభమైందన్నారు.
యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఇంజినీరింగ్‌ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాలలతో పాటు ఏ టి సి, ఎన్ ఎ సి స్కిల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఎన్ ఎ సి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు రూ.20 కోట్లు కేటాయించామని చెప్పారు. ఎనిమిది నెలల్లో కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. అప్పటివరకు సెంట్రనరి కాలనీలో ఉన్న సింగరేణి భవనాలలో నాక్ కేంద్రం నడపాలని ఆయన సూచించారు.

మంథని ప్రాంతంలో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించారు. సూపర్‌ ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, వరి సాగును తగ్గించాలని కోరారు. ఆయిల్‌పామ్‌ వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, గత పదేళ్లలో పెద్దపల్లి జిల్లాలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. నిధులు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్యపై యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు యువత సమస్యలపై ఉద్యమాల్లో పాల్గొని లాఠీచార్జీలను ఎదుర్కొన్నారని తెలిపారు.

గతంలో నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టని వారు ఇప్పుడు యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో ఏ టి సి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఎంపీ తెలిపారు. యువత ఉద్యోగాలు కావాలా, కేసులు కావాలా అన్నది ఆలోచించి నిర్ణయించుకోవాలని సూచించారు.

గత రెండేళ్లలో మణుగూరు–రామగుండం రైల్వే లైన్‌కు సుమారు రూ.4 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఇతర అభివృద్ధి పనులకు కూడా తన కృషితో సుమారు రూ.500 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు.

అనంతరం మంత్రులు వైకుంఠ రథాలను ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌, మంథని మున్సిపల్‌ చైర్మన్‌ వి. శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ సహేందర్ రెడ్డి, రామగుండం మేయర్‌ ఎం. స్వామి, డిప్యూటీ మేయర్‌ పారుపల్లి ఎల్లయ్య,విద్యుత్ శాఖ సలహాదారు కాచే శశిభూషణ్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!