“అర్జున్ సమాచారం:
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచ దేశాలకు తెలంగాణ సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక ప్రయోజనాలను జోడించి ‘ఏఐ ప్రమాణాలకు దిక్సూచి’గా తెలంగాణ నిలుస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
హైదరాబాద్‌లోని హెచ్.ఐ.సి.సి (HICC) వేదికగా జరిగిన ‘గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్’ కార్యక్రమాన్ని, పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు.
‘ది మెరీడియన్ కలెక్టివ్’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది.
ఈ సమ్మిట్ కు వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ “ఏఐ అంటే కేవలం క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్లు మాత్రమే కాదని, దీని వెనుక విద్యుత్, నీరు, భూమి మరియు మానవ వనరుల భాగస్వామ్యం ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. “మేము ఏఐ వద్దు అనడం లేదు, కానీ ఆ ఏఐ ఎలా ఉండాలో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నాము” అని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను, ముఖ్యంగా నీరు మరియు విద్యుత్తును హరిస్తూ ఏఐని నిర్మించడం కాకుండా, పునరుత్పాదక ఇంధనం మరియు బాధ్యతాయుతమైన వనరుల నిర్వహణతో తెలంగాణ ఏఐకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
పెట్టుబడులను ఆహ్వానించడంలో తెలంగాణ దూకుడుగా ఉన్నప్పటికీ, అది పర్యావరణానికి మరియు స్థానిక ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “కేవలం భూమి, నీరు, విద్యుత్ ఇచ్చి చేతులు దులుపుకునే పద్ధతి కాకుండా.. పరిశ్రమలు స్థానిక నైపుణ్యాలను పెంపొందించాలి, స్వచ్ఛమైన ఇంధనాన్ని వాడాలి, మరియు రీసైకిల్ చేసిన నీటిని మాత్రమే వినియోగించాలి. ఇది కేవలం ఇంజనీరింగ్ మెరుగుదల కాదు, ఇది మన విలువలకు నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కార్బన్ క్రెడిట్స్ గురించి చర్చిస్తున్న సమయంలో, తెలంగాణ ‘పీపుల్స్ క్రెడిట్’ అనే కొత్త భావనను తెరపైకి తెచ్చిందని వెల్లడించారు. ఏఐ పెట్టుబడులు కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా, స్థానిక ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ యువతకు నైపుణ్యాలను అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం నిర్దేశిస్తుందని అన్నారు.
పెట్టుబడులు రావాలి, కానీ అవి స్వచ్ఛమైన ఇంధనంతో, పారదర్శకతతో, ప్రజల పట్ల గౌరవంతో రావాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కంపెనీలు కేవలం ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, స్థానిక మేధో సంపత్తిని మెరుగుపరిచే బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
రైతులకు, సామాన్యులకు భరోసా: వ్యవసాయానికి, సామాన్యులకు దక్కాల్సిన నీటితో సాంకేతికత ఎప్పుడూ పోటీ పడకూడదని భట్టి విక్రమార్క నొక్కి చెప్పారు. నీటి వినియోగంలో అత్యంత బాధ్యతాయుతమైన విధానాలను అనుసరిస్తున్న ఏఐ వ్యవస్థలకే తెలంగాణ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఏఐ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని, భాషా అడ్డంకులను తొలగించి, మహబూబాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు.
నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశం అనుసరించిన శాస్త్ర, సాంకేతిక వృద్ధి పథాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత ముందుకు తీసుకెళ్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ అంటే కేవలం డేటా సెంటర్ల కేంద్రం మాత్రమే కాదు, ఆ డేటా సెంటర్లు ఎలా నిర్మించాలో ప్రపంచానికి నేర్పే ‘రోల్ మోడల్’ అని ఆయన గర్వంగా ప్రకటించారు.
పరిశ్రమలకు స్వాగతం పలుకుతూనే, ‘ప్రజల పక్షపాతి’గా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, భవిష్యత్తులో ప్రపంచ ఏఐ ప్రమాణాలను హైదరాబాద్ నిర్ణయించే స్థాయికి తీసుకువెళ్తాయన్నారు.
పాతదానికి-కొత్తదానికి మధ్య వారధిగా ఉన్న హైదరాబాద్, నేడు ‘ఏఐ బాధ్యతాయుత ప్రమాణాలకు’ దిక్సూచిగా మారిందన్నారు.
పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అద్భుతమైన వాతావరణం, పారదర్శకమైన పాలన, మానవీయ విలువలతో కూడిన అభివృద్ధి విధానాలు పెట్టుబడిదారులకు గొప్ప భరోసానిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ మేధస్సుతో పాటు, మానవీయ వివేకం కూడా కలిగిన సంస్థలే ప్రపంచాన్ని ఏలుతాయని, ఆ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందని వివరించారు.

