గోదావరిఖని:
రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఈరోజు గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లు తొలగించారనే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఇప్పటికే ఉన్న ఓటర్ల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఓటు హక్కును పరిరక్షించడం, రాజ్యాంగ విలువలను కాపాడటం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంవిధాన్ రక్షా మార్చ్‌కు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీసీసీ పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీ గురువారం టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీగా సంవిధాన్ రక్షా మార్చ్ – రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ* నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ర్యాలీ 26వ తేదీ ఉదయం 10:30 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి ప్రారంభమై నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంవిధాన్ రక్షా మార్చ్‌ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు విజ్ఞప్తి చేశారు.
“మన ఓటు – మన హక్కు, ప్రజాస్వామ్యం – మన బలం” అనే నినాదంతో ఓటు హక్కును, రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ ముస్తఫా కార్పోరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
========================

