ఉంగుటూరు, ఆగస్టు 4,అర్జున్ సమాచారం:
ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి వైజాగ్‌కు 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న
‘బి.ఎల్.ఎమ్’ (BLM) ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం రహదారిపైనే పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది
గాయపడగా, వారిలో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో తీవ్ర భయాందోళనకు
గురయ్యారు. బస్సు మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్లే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిందని ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న
వెంటనే ఉంగుటూరు పోలీసులు, 108 అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను బస్సు అద్దాలు పగలగొట్టి వెలుపలికి తీశారు. గాయపడిన 18
మంది స్వల్ప గాయాలతో బయటపడగా, తీవ్రంగా గాయపడిన ఏడుగురిని తక్షణ చికిత్స నిమిత్తం పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆసుపత్రి
వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెంటనే స్పందించి క్రేన్
సహాయంతో బోల్తా పడిన బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే
కారణమా లేక బస్సులో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు
========================

