అర్జున్ సమాచారం:
హామీలు అడిగితే తప్పుపడతారా..
దివ్యాంగుల పక్షాన ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం సమర శంఖారావం సభ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవ రెడ్డి, దేవీ ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దివ్యాంగులను ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..
ఈరోజు తెలంగాణలో ఉన్నది దయలేని ప్రభుత్వం. దివ్యాంగుల పట్ల కనీస మానవత్వం కూడా లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
ఆనాడు దివ్యాంగుల కష్టాలను అర్థం చేసుకున్న కేసీఆర్ గారు, నెలకు కేవలం రూ.500గా ఉన్న పెన్షన్ను 8 రెట్లు పెంచి రూ.4,016 చేశారు. వారిని ఓటర్లుగా కాదు, కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆసరా పెన్షన్ల కోసం సుమారు రూ.54 వేల కోట్లు ఖర్చు చేస్తే, అందులో కేవలం దివ్యాంగుల కోసమే రూ.10,300 కోట్లు అందజేశాం. ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్ ఇచ్చాం.
దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు డబుల్ బెడ్రూం ఇళ్లలో 5 శాతం రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించింది కేసీఆర్ గారే.
దివ్యాంగుల హక్కుల చట్టాన్ని దేశంలోనే అత్యుత్తమంగా అమలు చేసిన రాష్ట్రంగా 2015లోనే తెలంగాణ జాతీయ అవార్డు గెలుచుకుంది.
మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగుల పెన్షన్ను ఒక్క రూపాయి కూడా పెంచలేదు.
పైగా నెలనెలా ఇవ్వాల్సిన పెన్షన్ను ఒక నెల ఇస్తూ, ఇంకో నెల ఆపుతూ.. ఏకంగా మూడు నెలల పెన్షన్ ఎగ్గొట్టాడు.
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు రూ.6000 పెన్షన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ.. ఇలా ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి దగా చేశారు. ఒక్క బ్యాక్లాగ్ పోస్టును కూడా భర్తీ చేయలేదు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచిపోయాయి. రాష్ట్రంలోని 5 లక్షల 11 వేల మంది దివ్యాంగులకు హామీ ఇచ్చిన నెలకు రూ.6000 చొప్పున లెక్కేస్తే.. ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం ఏకంగా 66 వేల రూపాయలు బాకీ పడింది.
ఎన్నికలు దగ్గర పడే సమయానికి ఆరు నెలల పెన్షన్లు విదిలించి ప్రజలను మభ్యపెట్టొచ్చు అనుకుంటున్నారేమో! దివ్యాంగులు మీ మోసాలను మర్చిపోరు. మిమ్మల్ని నమ్మరు.
దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? లేక మనసు లేదా? అందాల పోటీలకు, ఫుట్బాల్ సోకులకు, మూసీ సుందరీకరణకు వందల, లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఫ్యూచర్ సిటీ పేరుతో ఆర్భాటాలు చేయడానికి, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా టీవీల్లో మీ ఫొటోలతో ప్రకటనలు ఇచ్చుకోవడానికి కోట్లు ఉంటాయి కానీ పెన్షన్లకు ఉండవా?
కేసీఆర్ గారు అత్యద్భుతమైన సెక్రటేరియట్ కట్టారు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు. జూబ్లీహిల్స్ లో నీకు నివాసం ఉంది.
అయినా ఇవన్నీ కాదన్నట్టు కొత్త క్యాంప్ ఆఫీస్ కోసం వందల కోట్లు ఖర్చు చేయడానికి మాత్రం డబ్బులు ఉంటాయి.
వాస్తవం ఏంటంటే.. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తే వాళ్ల నుంచి మీకు కమీషన్లు వస్తాయి. అదే దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తే కమీషన్ రాదు కదా! అందుకే దివ్యాంగులను నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఈ 33 నెలల కాలంలోనే రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మేశారు. అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఆస్తులను ముఖ్యమంత్రి తన సొంత తమ్ముడికి కట్టబెడుతున్నాడు.

