కరీంనగర్,అర్జున్ సమాచారం:
ఆధునిక సాంకేతికతతో నేర నియంత్రణ, దర్యాప్తులో మరింత సామర్థ్యం పెంపే లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పిటిసి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు శాఖ కూడా అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధస్సు ఏI డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, స్మార్ట్ సర్వైలెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేరాల నియంత్రణ, దర్యాప్తు, ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2018, 2020 మరియు 2024 బ్యాచ్‌లకు చెందిన కానిస్టేబుళ్లకు ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో మూడు కమిషనరేట్లు నిజామాబాదు,కరీంనగర్, సిద్దిపేట ఆరు జిల్లాలకు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, ఆసిఫాబాద్ చెందిన పోలీసు సిబ్బందికి మొత్తం 11 దశల్లో శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ప్రతి దశలో 80 మంది కానిస్టేబుళ్లు పాల్గొంటారని, ప్రతి బ్యాచ్‌కు ఐదు రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నట్లు వివరించారు.
శిక్షణలో భాగంగా ఏI ఆధారిత పోలీసింగ్, డిజిటల్ సాక్ష్యాల నిర్వహణ, సైబర్ నేరాల గుర్తింపు మరియు నివారణ, స్మార్ట్ సర్వైలెన్స్ వ్యవస్థలు, దర్యాప్తులో సాంకేతిక వినియోగం, డేటా విశ్లేషణ, నైతిక విలువలు, గోప్యతా నిబంధనలు, చట్టపరమైన అంశాలపై నిపుణులచే ప్రాయోగిక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
పోలీసు సిబ్బంది సాంకేతికంగా మరింత నైపుణ్యం సాధించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించే విధంగా ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు. తెలంగాణ పోలీసు శాఖను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతికంగా మరింత బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్ అడిషనల్ ఎస్పీ ఎం. పిచ్చయ్య, వైస్ ప్రిన్సిపల్ ఏసీపీ గంగాధర్, ఏసీపీ లు విజయపాల్ రెడ్డి, బి. నారాయణ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
============================

