ePaper
Friday, August 14, 2026
ePaper
Homeఎడిటోరియల్పవిత్ర స్నానాలు, ఆలయ దర్శనాలతో భక్తి పారవశ్యం – గోదావరి ఘాట్ వద్ద భద్రతా ఏర్పాట్లు...

పవిత్ర స్నానాలు, ఆలయ దర్శనాలతో భక్తి పారవశ్యం – గోదావరి ఘాట్ వద్ద భద్రతా ఏర్పాట్లు కల్పించాలని భక్తుల విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

తొలి ఏకాదశి వేళ గోదావరి తీరానికి పోటెత్తిన భక్తజనం

పవిత్ర స్నానాలు, ఆలయ దర్శనాలతో భక్తి పారవశ్యం – గోదావరి ఘాట్ వద్ద భద్రతా ఏర్పాట్లు కల్పించాలని భక్తుల విజ్ఞప్తి

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచారం జూలై 25

మంథని పట్టణంలోని పవిత్ర గోదావరి తీరానికి తొలి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు, పురుషులు, చిన్నారులు కుటుంబ సమేతంగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించి, అనంతరం గోదావరి ఒడ్డున వెలసిన శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వద్ద భక్తుల రద్దీ నెలకొని ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించారు. గోదావరి స్నానం అనంతరం దానధర్మాలు, తులసి పూజ, విష్ణు సహస్రనామ పారాయణం వంటి పుణ్యకార్యాలు నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో గోదావరి తీరం భక్తిరసంతో నిండిపోయింది.

అయితే గోదావరి ఘాట్ వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. నదిలోకి దిగే ప్రాంతాల్లో బండరాళ్లపై పాచిపట్టి జారుడు పరిస్థితులు ఏర్పడినప్పటికీ, అక్కడ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సిబ్బంది, గజ ఈతగాళ్లు లేదా తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు ఎవరైనా నీటిలో జారిపడితే వెంటనే రక్షించే ఏర్పాట్లు ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రానున్న పర్వదినాల్లో బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, వైద్య శిబిరం, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.

తొలి ఏకాదశి విశిష్టత

హిందూ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయనీ ఏకాదశిగా భావిస్తారు. ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలాన్నే చాతుర్మాస్య ప్రారంభంగా పరిగణిస్తారు. తొలి ఏకాదశి రోజున ఉపవాసం, జపం, ధ్యానం, దానధర్మాలు, విష్ణు ఆరాధన చేయడం వల్ల పాప విమోచనం కలిగి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!