ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్సున్నిపెంటలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన

సున్నిపెంటలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన

📰 Generate e-Paper Clip

శ్రీశైలం,అర్జున్ సమాచారం:
శ్రీశైలం ప్రాజెక్టులో ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని సానుకూల దృక్పథంతో పరిశీలించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట రెడ్డివారి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌లు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. అందిన ప్రతి అర్జీని స్వయంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.*

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, వారి సమస్యలను నేరుగా తెలుసుకొని వేగవంతంగా పరిష్కరించడమే ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికే  శ్రీశైలం నియోజకవర్గంలో ఆత్మకూరు, మహానంది, వెలుగోడు మండలాలలో 900కు పైగా అర్జీలు స్వీకరించామని, వాటిలో అత్యధికంగా రెవెన్యూ, సంక్షేమం తదితర శాఖలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి అర్జీపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్య వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న అనంతరమే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.  సమస్య పరిష్కారమైన వెంటనే సంబంధిత ఉత్తర్వులు లేదా చర్యల ప్రతిని అర్జీదారునికి అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో స్వీకరించిన అన్ని వినతులను కలెక్టరేట్ బృందం డిజిటలైజ్ చేసి వెంటనే సంబంధిత శాఖలకు పంపించి నిరంతర పర్యవేక్షణ చేపడుతుందని తెలిపారు.

సున్నిపెంట ప్రాంతంలో అధికంగా ఇళ్ల స్థలాలు, గృహాలు, పెన్షన్లు, విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ, ప్రాథమిక వసతులకు సంబంధించిన సమస్యలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను అర్హతల మేరకు పరిశీలించి, స్థలం మాత్రమే కోరిన వారి వివరాలను వేరుగా నమోదు చేయాలని, ఇల్లు మరియు స్థలం రెండూ అవసరమైన వారి ప్రతిపాదనలను ఆర్డీఓకు పంపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సున్నిపెంటలో కొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు ఇళ్లకు ఒకే విద్యుత్ మీటర్ ఉండటం వల్ల పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోతున్నాయని వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ, గతంలో కేటాయించిన గృహాల జాబితాను పరిశీలించి ప్రతి ఇంటికి ప్రత్యేక విద్యుత్ మీటర్, విద్యుత్ కనెక్షన్ కల్పించేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వెస్ట్రన్ కాలనీతో పాటు ఇతర కాలనీల్లో వీధి దీపాలు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కొరత ఉందని ప్రజలు తెలియజేశారని, సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అడవి మృగాల సంచారం దృష్ట్యా వీధి దీపాల ఏర్పాటు అత్యవసరమని పేర్కొంటూ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో అంచనాలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. సున్నిపెంట తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల వరకు నిధులు మంజూరు చేసిందని, టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా పైప్‌లైన్లు, మోటార్లు, ప్రత్యామ్నాయ నీటి వనరులను సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. రోడ్లు ఉన్న ప్రాంతాల్లో డ్రెయినేజీ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ కార్యాచరణ రూపొందించి డ్రెయినేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల ద్వారా ఇప్పటికే అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని, త్వరలో సున్నిపెంట ప్రాంత యువతకు ఉపయోగపడేలా మరో భారీ ఉద్యోగ మేళా నిర్వహించి సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారిని ఆదేశించారు.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!