భీమారం పిఎం శ్రీ జెడ్పీ పాఠశాల లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు.
పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు బహుమతులు అందజేసిన భీమారం సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి
భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, ఆగస్ట్ 15
పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీమారం లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంఈఓ శ్రీనివాస్ పిలుపు మేరకు భీమారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఉస్కమల్ల విజయలక్ష్మి-పున్నం చందు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఉస్కమల్ల విజయలక్ష్మి-పున్నం చందు దంపతులు గతంలో ఇచ్చిన హామీ మేరకు పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్ సొంత ఖర్చు తో నగదు బహుమతులను ప్రధానం చేశారు.
ఇందులో ప్రథమ బహుమతి: సిహెచ్. రమేష్ (రూ. 10,000/-), ద్వితీయ బహుమతి: వైష్ణవి (రూ. 5,000/-), తృతీయ బహుమతి: అంకిత (రూ. 2,000/-) విద్యార్థులు నగదు స్వీకరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. “మన భీమారం ప్రభుత్వ పాఠశాలలో ఎంతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకుంటూ శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి. రేపటి భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని ఆకాంక్షించారు. అలాగే, వచ్చే విద్యాసంవత్సరంలో కూడా పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇలాగే నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు.
అనంతరం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు భీమారం మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

