అప్పన్నపేటలో ఘనంగా జిల్లా స్థాయి యోగా పోటీలు ,రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా విద్యార్థులకు ప్రోత్సాహం.
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 29:
పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం పెద్దపల్లి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, యోగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అప్పన్నపేట సర్పంచ్ ఆరే సంతోష్ హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. పురుషోత్తం, పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జరీనా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆరే సంతోష్ మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతత లభిస్తాయని తెలిపారు. యోగాను కేవలం వ్యాయామంగా కాకుండా ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు మార్గంగా కూడా ఉపయోగించుకోవచ్చని అన్నారు. యోగాలో డిగ్రీలు, ఉన్నత విద్యను అభ్యసించి అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అప్పన్నపేట పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
పెద్దపల్లి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ నాగండ్ల మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ప్రశాంతతను, జీవితానికి క్రమశిక్షణను అందించే గొప్ప జీవన విధానమని అన్నారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యల నేపథ్యంలో యోగా ప్రాముఖ్యత మరింత పెరిగిందన్నారు. చిన్న వయస్సు నుంచే పిల్లలు, యువత యోగాను అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణతో కూడిన సమాజానికి బలమైన పునాదులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో దాగి ఉన్న యోగా ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు, క్రీడాకారులకు కూడా యోగా ద్వారా లభించే అవకాశాలు, ప్రయోజనాలను చేరవేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగా పోటీల్లో ఎలా పాల్గొనాలి, ఉన్నత విద్యకు ఎలా వెళ్లాలి, యోగాలో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
యోగాసనాలు, ధ్యానం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు డిగ్రీ తర్వాత పీజీ, ఎంఎస్సీ, యోగా పీజీ డిప్లొమా వంటి ఉన్నత విద్యా అవకాశాలు, వివిధ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, అర్హతలపై విద్యార్థులకు మార్గదర్శనం చేయడమే అసోసియేషన్ లక్ష్యమని తెలిపారు. యోగా ద్వారా దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయని, విద్యార్థులు సరైన దిశలో శిక్షణ పొందితే అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని అన్నారు.
జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికైన వివిధ వయో విభాగాల విద్యార్థుల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన వారు సెప్టెంబర్ మొదటి వారంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన వారు జాతీయ స్థాయికి, అక్కడ ప్రతిభ కనబరిచిన వారు అంతర్జాతీయ స్థాయికి వెళ్లే అవకాశాలు ఉంటాయని వివరించారు. యోగా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించే వరకు పెద్దపల్లి జిల్లా యోగా అసోసియేషన్ వారి వెన్నంటి నిలిచి ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతర్ల సాగర్, సంయుక్త కార్యదర్శి దొడ్డే అవినాష్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు గుంటి రామకృష్ణ, జడ్పీహెచ్ఎస్ అప్పన్నపేట శారీరక విద్యా దర్శకుడు డాక్టర్ వేల్పుల సురేందర్, ప్రాంతీయ నిర్వాహకుడు బొల్ల మల్లేష్, ఋషి యోగా ఫౌండర్ హైదరాబాద్ సునీత, నిర్వాహకులు రాజశేఖర్, ప్రశాంత్, ఆనంద్ కిషోర్, శారీరక విద్యా ఉపాధ్యాయులు, శారీరక విద్యా దర్శకులు దుర్గాప్రసాద్, భగీందర్, ఇర్ఫాన్, యశ్వంత్, శ్యామల, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొని పోటీలను విజయవంతం చేశారు.

