లక్కారంలో రైతులకు పంటల నమోదు, పీఎం కిసాన్ ఈ-కేవైసీపై అవగాహన.
అర్జున్ సమాచారం | ఆగస్టు 29 | ముత్తారం రిపోర్టర్
ముత్తారం మండలం లక్కారం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు రైతులకు పంటల నమోదు, పీఎం కిసాన్ ఫేషియల్ ఈ-కేవైసీ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) బి. శశిధర్ రైతులకు డిజిటల్ క్రాప్ సర్వే, పీఎం కిసాన్ ఫేషియల్ ఈ-కేవైసీ, సన్న వరి సాగు వివరాల నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రైతులు సాగు చేసిన పంట, పంట రకం, నీటిపారుదల సౌకర్యం తదితర వివరాలను సర్వే నంబర్ వారీగా డిజిటల్ క్రాప్ సర్వేలో సక్రమంగా నమోదు చేయించుకోవాలని సూచించారు.
పంట రకాలను సక్రమంగా నమోదు చేసుకోవడం ద్వారా పంట విక్రయాల సమయంలో ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పథకం కింద రూ.2,000 పొందుతున్న రైతులకు ఫేషియల్ ఈ-కేవైసీ నిర్వహించారు. రైతులు తమ ఆధార్ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
డీలర్ వద్ద కాకుండా సొంతంగా సన్న వరి సాగు చేసిన రైతుల వివరాలు, సంబంధిత దరఖాస్తుల నమోదుపై కూడా అవగాహన కల్పించారు. అదేవిధంగా పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు వివరాలను కూడా డిజిటల్ క్రాప్ సర్వేలో తప్పనిసరిగా సక్రమంగా నమోదు చేయించుకోవాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో లక్కారం గ్రామ సర్పంచ్ అత్తే చంద్రమౌళి, AEO బి. శశిధర్, గ్రామ వాలంటీర్ గనవేన కుమార్తో పాటు రైతులు రాజయ్య, సతీష్, నారాయణ, సారయ్య, నరసయ్య, మోహన్ రెడ్డి, శంకర్, లింగయ్య, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

