ePaper
Monday, November 23, 2026
ePaper
Homeఆరోగ్యంప్రవాసి కార్మికుడి చివరి కోరిక.

ప్రవాసి కార్మికుడి చివరి కోరిక.

📰 Generate e-Paper Clip

ప్రవాసి కార్మికుడి చివరి కోరిక.

జగిత్యాల జిల్లా ప్రతినిధి :అర్జున్ సమాచారం నవంబర్ 21::

ఇటలీ నుంచి స్వదేశానికి వచ్చి తుదిశ్వాస విడవాలని క్యాన్సర్. బాధితుడి ఆఖరి కోరిక!
కుటుంబ సభ్యుల మధ్య, మాతృభూమిపై చివరి రోజులు గడపాలని ఆకాంక్ష.
వైద్యుల అంచనా ప్రకారం మరో నెల మాత్రమే జీవించే అవకాశం.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం పిప్రి గల్లీకి చెందిన పోల శంకర్ (60) గత 18 ఏళ్లుగా జీవనోపాధి కోసం ఇటలీలో పనిచేస్తున్నారు. కుటుంబానికి దూరంగా, విదేశీ గడ్డపై జీవనం సాగించిన ఆయనకు ఇప్పుడు విధి మరో పరీక్ష పెట్టింది. కొలన్ క్యాన్సర్ చివరి దశలో ఆరోగ్యం విషమించింది. వైద్యుల అంచనా ప్రకారం ఆయన మరో నెల రోజులు మాత్రమే జీవించే అవకాశం ఉంది. కుమారుల వివాహాల సందర్భంగా 2013, 2018 సంవత్సరాల్లో రెండుసార్లు స్వస్థలానికి వచ్చి వెళ్లిన శంకర్, గత ఎనిమిదేళ్లుగా భారత్ కు రాలేదు.

ఈ నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచన మేరకు, కుటుంబ సభ్యులు సహాయం కోసం నవంబర్ 17న హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌లో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని సంప్రదించారు. తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి సహకారంతో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్‌ను కలిసి తమ దీనస్థితిని వివరించారు. ముఖ్యమంత్రి, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించి, శంకర్ ను ఇటలీ నుంచి స్వదేశానికి తీసుకువచ్చేందుకు తక్షణ ప్రభుత్వ సహాయం అందించాలని అతని భార్య లక్ష్మి, కుమారుడు అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఇటలీలోని అవియానో పట్టణంలో ఉన్న హాస్పిస్ వియా డి నటాలే వైద్య సంస్థ జారీ చేసిన నివేదిక ప్రకారం, శంకర్ రెక్టమ్ క్యాన్సర్ తీవ్రస్థాయికి చేరుకుంది. మధుమేహం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, రక్తస్రావం వంటి సమస్యలతోనూ బాధపడుతున్నారు. గత 15 ఏళ్లుగా మల విసర్జన కొరకు శరీరం బయట అమర్చిన బ్యాగ్ ను ఉపయోగిస్తున్నారు.

జీవితమంతా కుటుంబం కోసం పరాయి దేశంలో కష్టపడిన శంకర్, తన జీవితపు చివరి క్షణాలనైనా భార్యా పిల్లలు మనుమలు మనవరాలు మధ్య, పుట్టి పెరిగిన ఊరిలో గడపాలని తపిస్తున్నారు. ఈ హృదయవిదారక పరిస్థితుల్లో ఆయనను ఎలాగైనా స్వదేశానికి తీసుకువచ్చి, కుటుంబ సభ్యుల సమక్షంలో చివరి రోజులు గడిపే అవకాశం కల్పించాలని, అవసరాన్ని బట్టి హైదరాబాద్ లోని ‘నిమ్స్’ హాస్పిటల్ లో అడ్మిషన్ ఇప్పించాలని భార్య లక్ష్మి, కుమారుడు అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పెషేంట్ ను ఇటలీ నుంచి స్వదేశానికి తెప్పించాలని తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఇటలీ మిలన్ లోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీ లోని భారత విదేశాంగ శాఖకు లేఖలు రాశారని తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వ ‘మదద్’ పోర్టల్ (కాన్సులార్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం – భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన సేవల పర్యవేక్షణ వ్యవస్థ) లో ‘రిపాట్రియేషన్’ అనే క్యాటగిరిలో విజ్ఞప్తిని నమోదు చేశామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!