ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణభారీ వర్షాల వేళ అప్రమత్తమే ప్రాణ రక్షణ..జైపూర్ మండల ప్రజలకు అధికారుల విజ్ఞప్తి – వాగులు,...

భారీ వర్షాల వేళ అప్రమత్తమే ప్రాణ రక్షణ..జైపూర్ మండల ప్రజలకు అధికారుల విజ్ఞప్తి – వాగులు, చెరువులు, గోదావరి పరిసరాలకు దూరంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

భారీ వర్షాల వేళ అప్రమత్తమే ప్రాణ రక్షణ..
జైపూర్ మండల ప్రజలకు అధికారుల విజ్ఞప్తి – వాగులు, చెరువులు, గోదావరి పరిసరాలకు దూరంగా ఉండాలి

అర్జున్ సమాచారం జులై 29 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:

జైపూర్ మండలం: నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మండల అభివృద్ధి అధికారి జి. సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు కోరారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వర్షాల పరిస్థితిని పరిశీలించారు.
మండల పరిధిలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. వాగులు, చెరువులు, గోదావరి పరిసర ప్రాంతాలకు మత్స్యకారులు, గ్రామస్థులు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
రసూల్‌పల్లి వద్ద తక్షణ చర్యలు.
రసూల్‌పల్లి సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహించి జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శులు స్పందించి యంత్ర సహాయంతో నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
టేకుమట్ల, కుందారం వాగుల వద్ద రక్షణ చర్యలు
టేకుమట్ల వాగు, కుందారం పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ రహదారులను ముంచెత్తడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు, సంబంధిత గ్రామాల సర్పంచులు వెంటనే సంఘటనా స్థలాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వంతెనలపై నుంచి ఎవరూ దాటకుండా గ్రామపంచాయతీ సిబ్బందితో రక్షణ జాలీలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరో రెండు నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, విద్యుత్ తీగలు, పెద్ద చెట్లు, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
గ్రామాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలి.
గ్రామపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది గ్రామాల్లోనే అందుబాటులో ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో మండల అభివృద్ధి అధికారి జి. సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, టేకుమట్ల సర్పంచ్ బల్ల వెంకటేష్, ముదిగుంట సర్పంచ్ ఆకుల రవికుమార్, పలు గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు టి. శ్రీనివాస్, పి. సురేష్, ఎల్. ప్రశాంత్, ఎం. విష్ణువర్ధన్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!