ప్రజావాణి ప్రజల గోడు వినడానికా.. ఫైళ్లలో పూడ్చిపెట్టడానికా?: సామల అశోక్
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ విమర్శలు
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 03
మంథని ఆర్డీఓ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కార వేదికగా కాకుండా, ఫిర్యాదులను స్వీకరించి ఫైళ్లకే పరిమితం చేసే కార్యక్రమంగా మారిందని బీజేపీ మంథని పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్ ఆరోపించారు. బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ ఆదేశాల మేరకు సోమవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజావాణిలో నెలల క్రితం సమర్పించిన వినతిపత్రాలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం, ఇటీవల ఇచ్చిన ఫిర్యాదులకూ స్పందన లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజావాణి ప్రజల గోడు వినే వేదికా, లేక దరఖాస్తులను స్వీకరించి ఫైళ్లలో పక్కన పెట్టే కార్యక్రమమా అని ప్రశ్నించారు.
ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు, ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి వెంటనే పరిష్కారం చూపాలని కోరారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవ తీసుకుని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుకు నిర్ణీత గడువులో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ఇదే నిర్లక్ష్య ధోరణిని కొనసాగిస్తే బాధితులతో కలిసి మంథని ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని సామల అశోక్ హెచ్చరించారు.

