జంతర్ మంతర్ ఉద్యమానికి మంచిర్యాలలో సంఘీభావ దీక్ష:
సహారా బాధితుల బకాయిల చెల్లింపుపై కేంద్రం తక్షణం స్పందించాలని డిమాండ్.
అర్జున్ సమాచారం జులై 05 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:
మంచిర్యాల: ఆగస్టు:05న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సహారా బాధితుల ఉద్యమానికి సంఘీభావంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ పార్కు ఆవరణలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా గడువు ముగిసినా తమకు రావాల్సిన డిపాజిట్ సొమ్ము అందక ఇబ్బందులు పడుతున్న సహారా బాధితులకు న్యాయం చేయాలని, సహారాలో సేవలందించిన లక్షలాది మంది సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు.
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు, సహారా బాధితుడు గజెల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో పలువురు బాధితులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ, గడువు ముగిసిన డిపాజిట్లకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను కోరారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న సహారా వ్యవహారానికి త్వరితగతిన పరిష్కారం చూపించి కోట్లాది మంది బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా సహారా బాధితుల సమస్యపై స్పందించి వారి పక్షాన నిలవాలని కోరారు. ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌లో ఈ సమస్యను ప్రస్తావించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీక్ష సందర్భంగా సహారా బాధితుల ఐక్యత వర్ధిల్లాలని, తమ సొమ్మును వెంటనే చెల్లించాలని, బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
కార్యక్రమంలో సహారా బాధితుడు పరిషే శ్రీనివాస్, న్యాయవాది కర్రె లచ్చన్నతో పాటు పలువురు బాధితులు పాల్గొన్నారు.

