మహనీయులను కీర్తించిన ఘనత బీఆర్ఎస్దే .మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నాం: పుట్ట మధూకర్.
అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 26. మంథని.
మహనీయుల స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహనీయులను గౌరవించి, వారి చరిత్రను ప్రజలకు చాటిచెప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మంథని పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. మహనీయుల ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందుచూపుతో రాజ్యాంగంలోని ఆర్టికల్-3ను పొందుపరిచారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో దాని ప్రాధాన్యతను గుర్తించిన కేసీఆర్ అంబేద్కర్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
వందల ఏళ్ల క్రితమే భవిష్యత్ తరాల కోసం పోరాటాలు చేసిన చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, కొమురం భీం వంటి మహనీయుల పోరాట స్ఫూర్తిని తెలంగాణ సమాజం స్మరించుకుంటోందన్నారు. వారి విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకుంటున్నామని తెలిపారు.
అయితే మంథనిలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి మున్సిపల్ పాలకవర్గం, అధికార యంత్రాంగం పూలమాల వేసి నివాళులు అర్పించకపోవడం బాధాకరమని అన్నారు. ఇది మహనీయులను అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో మంథనిలో మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని పుట్ట మధూకర్ ఆరోపించారు. తన తండ్రి చరిత్రను ప్రజలకు వివరించకుండా, ఆయనను మాత్రమే గౌరవించాలని చెబుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మాటలు విని స్థానిక పాలకవర్గం కనీసం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేయకపోవడాన్ని ఖండిస్తున్నానన్నారు.
ప్రభుత్వం అధికారికంగా మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ మంథనిలో మాత్రం వారికి కనీస గౌరవం దక్కడం లేదని విమర్శించారు. మహనీయుల విగ్రహాలు ఎక్కడ ఉన్నా వాటిని గౌరవించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే చాకలి ఐలమ్మతో పాటు అన్ని మహనీయులను ఘనంగా గౌరవిస్తామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారి చరిత్రను ప్రజలకు చాటిచెబుతామని పుట్ట మధూకర్ అన్నారు. మంథని ఎమ్మెల్యే ఓట్ల కోసం తమ సమాజాన్ని ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన వ్యాఖ్యానించారు.
చాకలి ఐలమ్మను గౌరవించకపోవడం మంథనిలో నెలకొన్న చీకటి పాలన, చీకటి ఆలోచనకు నిదర్శనమని పుట్ట మధూకర్ అన్నారు.

