ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిఆర్టీసీ డిపోను సందర్శించిన టీజీఎస్‌ఆర్టీసీ ఈడీ సోలమన్, ఆర్‌ఎం రాజు ఉత్తమ డ్రైవర్లు,...

ఆర్టీసీ డిపోను సందర్శించిన టీజీఎస్‌ఆర్టీసీ ఈడీ సోలమన్, ఆర్‌ఎం రాజు ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లకు ఘన సన్మానం – ‘ప్రగతి చక్రం’పై ప్రత్యేక దిశానిర్దేశం – డిపో ఆవరణలో మొక్కలు నాటిన అధికారులు

📰 Generate e-Paper Clip

గోదావరిఖని,అర్జున్ సమాచారం:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) శ్రీ సోలమన్, కరీంనగర్ రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం)  రాజు బుధవారం సాయంత్రం గోదావరిఖని ఆర్టీసీ డిపోను సందర్శించారు. డిపో మేనేజర్ శ్రీమతి కవిత పుష్పగుచ్ఛం అందజేసి అధికారులకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా డిపోలో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు శాలువాలతో ఘనంగా సత్కరించి, నగదు పురస్కారాలను అందజేశారు. సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను అధికారులు అభినందించారు.

అనంతరం డిపో అధికారులు, సూపర్‌వైజర్లు, మెకానిక్‌లు, డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులతో సమావేశం నిర్వహించి ‘ప్రగతి చక్రం’ ద్వారా సంస్థను మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. డిపోలో బస్సుల వినియోగం, ఆదాయ వృద్ధి, ఖర్చుల నియంత్రణ, ప్రయాణికులకు మెరుగైన సేవలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.

ప్రగతి చక్రంలో భాగంగా ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రైవర్లు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రమాద రహిత ప్రయాణానికి కృషి చేయాలని అధికారులు సూచించారు. బస్సులు మార్గమధ్యలో యాంత్రిక లోపాల కారణంగా నిలిచిపోకుండా ముందస్తు తనిఖీలు, తగిన నిర్వహణ చర్యలు చేపట్టాలని మెకానికల్ సిబ్బందికి సూచించారు.

అలాగే ఆదాయాన్ని పెంచుతూ అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలని, ప్రతి బస్సు మెరుగైన ఆక్యుపెన్సీతో నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా, సౌమ్యంగా వ్యవహరించి ఆర్టీసీపై నమ్మకాన్ని మరింత పెంచాలని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

‘ప్రగతి చక్రం’ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ గోదావరిఖని డిపోను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని ఈడీ సోలమన్, ఆర్‌ఎం రాజు సూచించారు.

ఈ సందర్భంగా డిపో ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కవితతో పాటు అధికారులు, సూపర్‌వైజర్లు, మెకానిక్‌లు, డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు, ఇతర డిపో సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
===============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!