పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 15:
సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, మంథని అభివృద్ధే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని, సింగరేణి విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాస్తవాలు గుర్తు చేసుకుని మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చందుపట్ల సునీల్‌రెడ్డి అన్నారు.
మంథనిలోని రామ్‌రెడ్డి కాంప్లెక్స్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి నాయకత్వంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర కార్మికులు, ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపిందన్నారు. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారని తెలిపారు.
మంథని ప్రాంతంలో బొగ్గు, గోదావరి జలాలు, ఇసుక వంటి సహజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కొరతతో అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. గతంలో లక్షా నలభై వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేసిన సింగరేణిలో ప్రస్తుతం సుమారు 35 వేల మంది మాత్రమే ఉన్నారని, దీనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాలే కారణమని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థలో 51 శాతం వాటా ఉన్నప్పటికీ సింగరేణిని బలోపేతం చేయకుండా ఆదాయ వనరుగా మాత్రమే ఉపయోగించుకుందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణిపై ఆర్థిక భారం పెరిగి, కార్మికుల జీతాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లపై ప్రభావం పడిందన్నారు.
2013–14లో బొగ్గు గనుల కేటాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు పాత కేటాయింపులను రద్దు చేసి వేలం విధానాన్ని అమలు చేయాలని ఆదేశించినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల బ్లాక్–2ను నేరుగా సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కేటాయింపులో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు.
తాడిచెర్ల బ్లాక్–2 కేటాయింపుతో మైనింగ్, అనుబంధ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మంథని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
ఏఎమ్మార్ సంస్థ స్థానిక ప్రజల భూములు తీసుకున్నప్పటికీ స్థానిక యువతకు తగిన ఉద్యోగాలు కల్పించడం లేదని ఆరోపించిన ఆయన, వెంటనే స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో కొండపాక సత్యప్రకాశ్, బోగోజు శ్రీనివాస్, సిలివేరి సతీష్, లక్ష్మణ్, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

