ePaper
Tuesday, November 17, 2026
ePaper
Homeజాతియంఢిల్లీవింటర్‌ సెషన్‌లో డీలిమిటేషన్‌.. డిసెంబర్‌ మొదటివారంలో పార్లమెంట్‌ సమావేశాలు

వింటర్‌ సెషన్‌లో డీలిమిటేషన్‌.. డిసెంబర్‌ మొదటివారంలో పార్లమెంట్‌ సమావేశాలు

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, : అర్జున్ సమాచారం:
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ తొలివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌), మహిళా కోటా బిల్లులను
ఆమోదింపజేసుకోవాలని కేంద్రం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతున్నది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌
సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను నియోజకవర్గాల పునర్విభజన ద్వారా గరిష్ఠంగా 850కు పెంచాలని రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదిస్తున్నది. ఈ
బిల్లు ఆమోదం ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే పార్లమెంట్‌, శాసనసభల్లో మహిళలు 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
బిల్లులు గట్టెక్కేనా?: ప్రభుత్వంలోని
కీలక వర్గాలతో చర్చించిన తర్వాత డిసెంబర్‌ మొదటి వారంలో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు పీటీఐకి తెలిపాయి. అయితే ఈ కీలక బిల్లులు ఆమోదింపజేయడానికి
అవసరమైన మెజారిటీ సాధించడం మోదీ సర్కార్‌కు సవాల్‌గా మారనుంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుత 543 స్థానాల్లో కనీసం
361 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీగా ఉండటంతో సభ్యుల సంఖ్య 540గా ఉన్నది. అధికార ఎన్డీయే కూటమికి 320 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నది. దీంతో
బిల్లు గట్టెక్కాలంటే విపక్షాల మద్దతు తప్పనిసరి. మరోవైపు, సర్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేసిన విపక్షాలు.. ప్రధాన ఎన్నికల కమిషన్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌
చేస్తున్నాయి. ఈ నిరసనలు పార్లమెంట్‌లో కొనసాగే అవకాశం ఉన్నది. దీంతో శీతాకాల సమావేశాలు మరోసారి గందరగోళంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సభ సజావుగా సాగితేనే
రాజ్యాంగ బిల్లుపై చర్చ, ఓటింగ్‌ సాధ్యమవుతుందని అధికార కూటమికి చెందిన ఓ ఎంపీ అభిప్రాయపడ్డారు. అయితే బిల్లుకు అవసరమైన మద్దతు లభిస్తుందనే నమ్మకంతో ప్రభుత్వం ఉన్నది. ఈ బిల్లు
15-18 ఓట్ల ఆధిక్యంతో గట్టెక్కుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నట్టు తెలిసింది.
ప్రొరోగ్‌ చేయకుండా..: ఇదిలా ఉండగా, వర్షాకాల సమావేశాలు అధికారికంగా ప్రొరోగ్‌ చేయకుండా ప్రభుత్వం
కొనసాగించడం కూడా తాజా సమావేశాల తేదీలపై ఊహాగానాలకు తెరలేపింది.
ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే వాటిని అధికారికంగా ముగించకపోవడంతో ఇప్పటికి 94 రోజులు గడిచాయి. 2008 నమోదైన 87 రోజుల రికార్డును ఇది
అధిగమించింది. ఈ విధానం ద్వారా అవసరమైతే ప్రస్తుత సమావేశాలనే పొడిగించి లేదా ప్రత్యేకంగా సమావేశమై రాజ్యాంగ సవరణ బిల్లును తక్కువ సమయంలోనే చేపట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే
కొనసాగుతున్న సమావేశాలను పొడిగించాలంటే కనీసం రెండు రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. కొత్త సమావేశాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 14 రోజుల ముందుగా నోటీసు అవసరం.
50 శాతం చొప్పున పెంపు!: ముఖ్యంగా డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ర్టాల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనలను తగ్గించేందుకు కేంద్రం ఓ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా అన్ని రాష్ర్టాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం చొప్పున పెంచాలని యోచిస్తున్నది. అదే సమయంలో 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ర్టాల మధ్య ప్రస్తుతం ఉన్న స్థానాల నిష్పత్తిని కొనసాగించే
ఫార్ములాను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఈ రాజ్యాంగ సవరణ బిల్లును
ప్రవేశపెట్టినప్పటికీ అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు భవితవ్యం కేంద్ర ప్రభుత్వానికి కీలక రాజకీయ , శాసనపరమైన పరీక్షగా
మారనుంది. కాగా, సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఎన్ని రోజుల్లో ప్రొరోగ్‌ చేయాలనే దానిపై రాజ్యాంగంలో నిర్దిష్ట గడువు విధించలేదు.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!