ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణప్రభుత్వ పాఠశాలలే నాణ్యమైన విద్యకు చిరునామా..విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయి – జిల్లాకు రెండో స్థానం గర్వకారణం...

ప్రభుత్వ పాఠశాలలే నాణ్యమైన విద్యకు చిరునామా..విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయి – జిల్లాకు రెండో స్థానం గర్వకారణం : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ పాఠశాలలే నాణ్యమైన విద్యకు చిరునామా..
విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయి – జిల్లాకు రెండో స్థానం గర్వకారణం : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

అర్జున్ సమాచారం జులై 08 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:

మంచిర్యాల, ఆగస్టు 07 :ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
దేశ స్థాయిలో విద్యా పురోగతిని అంచనా వేసే ప్రమాణాల్లో మంచిర్యాల జిల్లా రెండో స్థానాన్ని సాధించిన సందర్భంగా ఖమ్మం జిల్లా విద్యాశాఖ ప్రతినిధులు జిల్లాలో అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, హాజీపూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు పలు విద్యాసంస్థలను సందర్శించి అక్కడ అమలవుతున్న విధానాలను పరిశీలించారు. అనంతరం నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి విద్యా పురోగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వసతులు, పరిశుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం, మెరుగైన బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ కల్పిస్తూ జిల్లా, మండల స్థాయి అధికారులు తరచూ పాఠశాలలను సందర్శించి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తూ వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గత విద్యా సంవత్సరంలో నాలుగు శాతం ఉన్న విద్యార్థుల చేరికలు ప్రస్తుతం ఆరున్నర శాతానికి చేరాయని, వాటిని ఎనిమిది శాతానికి పెంచే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం విశేషమన్నారు.
ప్రస్తుతం ప్రతిరోజూ డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు విద్యార్థుల హాజరు నమోదవుతోందని, దానిని తొంభై శాతానికి పెంచే చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, విధులకు గైర్హాజరైతే తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఆదివాసి బాలబాలిక విద్యకు దూరం కాకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
పరిశుభ్రత, తాగునీరు, పౌష్టికాహారం, క్రమబద్ధమైన బోధన, తల్లిదండ్రుల భాగస్వామ్యం వంటి అంశాలే జిల్లాకు ఈ గుర్తింపు తీసుకొచ్చాయని చెప్పారు. విద్యారంగంలో మంచిర్యాల జిల్లా ముందంజలో నిలవడానికి ఉపాధ్యాయుల అంకితభావమే ప్రధాన కారణమని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!