ఆర్‌జీ-1 ఏరియా వర్క్‌షాప్‌ను సందర్శించిన కేంగర్ల మల్లయ్య.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: టీజీబీకేఎస్ డిమాండ్,
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 19:
టీజీబీకేఎస్ బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఆర్‌జీ-1 ఏరియా, ఏరియా వర్క్‌షాప్‌ను తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య సందర్శించారు. ఈ సందర్భంగా టీజీబీకేఎస్ అధ్యక్షుడు కేంగర్ల మల్లన్న మాట్లాడుతూ గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి మరో నెల రోజుల్లో ముగియనున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైన సొంత ఇంటి పథకం, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు వంటి అంశాలపై రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా నిరాశే మిగిలిందన్నారు. ఏరియా వర్క్‌షాప్‌లో అనేక సమస్యలు ఉన్నాయని, క్యాంటీన్‌లో కార్మికులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని తెలిపారు. కార్మికులు ఐక్యంగా కష్టపడి పనిచేసి సింగరేణిని నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం రక్షణ పరికరాలు, పని ముట్లు, భద్రతా సామగ్రి కొనుగోలుకు కూడా నిధులు లేవంటూ యాజమాన్యం కాలయాపన చేయడం సరికాదన్నారు. కార్మికుల భద్రత, సంక్షేమం, హక్కుల విషయంలో యాజమాన్యం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని టీజీబీకేఎస్ డిమాండ్ చేసింది. కార్యక్రమంలో టీజీబీకేఎస్ నాయకులు ముదిగిరి మల్లేష్, నరసింహస్వామి, చిగురుపల్లి మహేష్, శ్యామ్ కోరుకొప్పుల, తాండ్ర సత్యనారాయణ, శ్రీను అల్లాడి, కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

