ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణకాంగ్రెస్ హయాంలో నాణ్యమైన రెవెన్యూ సేవలు: ఓదెలలో రూ.75 లక్షలతో నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం

కాంగ్రెస్ హయాంలో నాణ్యమైన రెవెన్యూ సేవలు: ఓదెలలో రూ.75 లక్షలతో నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ హయాంలో నాణ్యమైన రెవెన్యూ సేవలు: ఓదెలలో రూ.75 లక్షలతో నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభ

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 25:

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం జలసిరి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇటీవల శ్రీరాంపూర్‌లో తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించగా, ఇప్పుడు ఓదెలలో కొత్త కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఓదెలకు కోర్టు మంజూరైందని, త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణం కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.

జిల్లాలో డబుల్ రోడ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని, పోత్కపల్లి–కాల్వ శ్రీరాంపూర్ డబుల్ రోడ్డు పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గత ఏడాది టెయిల్ ఎండ్ ప్రాంతాలకు సాగునీరు అందించగలిగామని, ముందస్తు ప్రణాళికతో చెరువులు నింపడం వల్ల ప్రస్తుతం కొంత మేర నీటి లభ్యత ఉందన్నారు.

రైతులు ఇటీవల కురిసిన వర్షాలతో మోసపోవద్దని, సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అధిక నీటి అవసరమయ్యే వరికి బదులుగా కందులు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించకుండా వరి సాగు చేస్తే నీటి కొరత కారణంగా తీవ్ర నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

కందులకు, నువ్వులకు ప్రస్తుతం మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయని, రైతులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జిల్లాకు ఆశించిన స్థాయిలో సాగునీరు వచ్చే పరిస్థితి లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, ప్రతి ఎకరానికి రూ.6 వేల రైతు భరోసా అందిస్తున్నామని, ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వరి కొనుగోళ్లలో క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు.

పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఓదెల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గత రెండేళ్లలో రూ.5.5 కోట్ల నిధులు వెచ్చించామని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి కూడా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, రూ.53 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి మరో రెండు నెలల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీరాములు, తహసీల్దార్ వనజ, ఎంపీడీవో అనిల్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!